ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


6వ వార్డులో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ నగదు అందజేత

‘బాగున్నారా’ అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ..

గుడివాడ, ఆంధ్రప్రభ: గుడివాడ పట్టణంలోని 6వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులు, అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ఆశీస్సులు అందిస్తూ తమ సమస్యలను వివరించగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పర్యటనలో పలుచోట్ల లబ్ధిదారులతో ఎమ్మెల్యే సరదాగా ముచ్చటించడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన బాధ్యత అని, ఇంటి బిడ్డలా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో అండగా నిలుస్తానని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పేదలకు నెలవారీ ఆర్థిక భరోసాగా నిలుస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.4 వేల పింఛన్‌ను నేరుగా లబ్ధిదారుల ఇంటికే అందిస్తున్నామని తెలిపారు. ప్రతి రూపాయి అవినీతికి తావులేకుండా అర్హుల చేతికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, నాయకులు గోర్జీ సత్యనారాయణ, చేకూరు జగన్మోహనరావు, సయ్యద్ జబీన్, దేవరపల్లి కోటి, ఏడుకొండలు, షణ్ముఖ్ రెడ్డి, 6వ వార్డు నాయకులు విష్ణుమూర్తుల ద్వారక, పిచ్చేటి రాజేశ్వరరావు, విశ్వనాథ్ నాగేశ్వరరావు, పల్లారావు, విష్ణు ప్రసాద్, నీలవేణి, నారాయణ, బుల్లయ్య, గీత, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.