విద్యతోనే విజయోత్సవం..
విద్యతోనే విజయోత్సవం..
- ప్రతిభావంతులకు నగదు పురస్కరాలు
- విశిష్ట ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేత
- టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యతోనే విజయోత్సవం సిద్ధిస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా “విద్య విజయోత్సవం” వేడుకలను ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విద్యా, క్రీడారంగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు చెక్కు, ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అతిథులు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సంగారెడ్డి జిల్లాకు, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అలాగే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి వారిని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దిన ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రత్యేకంగా అతిధులు సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.వెంకటేశ్వర్లు, అదనపు సంచాలకులు శంకర్, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు, మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యా సమన్వయ మండలి కార్యదర్శి లింబాజీ, బాలయ్య, తాజుద్దీన్, భీమగొండ, వెంకటస్వామి, సిద్ధారెడ్డి, టీటీయూ జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
