చిన్నారుల ఆరోగ్య రక్షణ అందరి బాధ్యత

  • ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి
  • కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్య భద్రతపైనే ఆధారపడి ఉంటుందని, ఐదేళ్లలోపు ప్రతి బిడ్డకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.

పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పోలియో నిర్మూలనకు కృషి చేయాలి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నుంచి పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రతి విడతలోనూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ప్రభుత్వం నిర్వహించే ప్రతి పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ మళ్లీ చుక్కలు వేయించడం సురక్షితమే కాకుండా, రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుందని వివరించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు కూడా నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
నూరు శాతం లక్ష్యాన్ని చేరాలి..
మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆరోగ్య శాఖ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా వంద శాతం పోలియో చుక్కల పంపిణీ లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ఎండలు, వర్షాలను సైతం లెక్కచేయకుండా ఇంటింటికీ తిరుగుతూ సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బంది సేవలను ఆయన అభినందించారు.

అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన మొబైల్ పోలియో కేంద్రాలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి పల్లె, పట్టణంలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికంగా చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.