లారీ ఢీకొని వ్యక్తి మృతి..
చేగుంట, ఆంధ్రప్రభ : మాసాయిపేట మండలం రామంతాపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన షేక్ ఎల్లం (35), రామంతాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయిన ఆంజనేయులతో కలిసి బైక్‌పై చేగుంట నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ రామంతాపూర్ చౌరస్తా వద్ద వారి బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో షేక్ ఎల్లం కడుపుపై నుంచి లారీ వెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఇద్దరినీ అంబులెన్స్‌లో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే షేక్ ఎల్లం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గాయపడిన ఆంజనేయులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.
