ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..
- తిరువూరులో తెల్లవారుజామున ఘటన..
- ఒకే బైక్‌పై ఐదుగురు మైనర్లు..
- బైక్ ని ఢీ కొట్టిన లారీ
- ఇద్దరు మృతి..
- ముగ్గురికి తీవ్ర గాయాలు…
- ఒకరి పరిస్థితి విషమం,
- విజయవాడకు అత్యవసర చికిత్స కు తరలింపు
తిరువూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో తెల్లవారుజామున జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న ఐదుగురు మైనర్లను వెనుక నుంచి గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో ఇద్దరు బాలురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స కోసం విజయవాడకు తరలించారు. తిరువూరు మండలం లక్ష్మీపురం వద్ద నూజివీడు రోడ్డుపై తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్యాటరింగ్ పనుల కోసం నూజివీడుకు వెళ్లిన ఐదుగురు మైనర్లు తిరిగి తిరువూరుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. లక్ష్మీపురం వద్ద ఒకరిని ఇంటి వద్ద దింపేందుకు జాతీయ రహదారిపై బైక్ నిలిపిన సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నక్కా ఈశ్వర్ (16), మోదుగు సన్నీ (17) అక్కడికక్కడే మృతిచెందారు. ఢీ కొట్టిన తీవ్రతకు వారి మృతదేహాలు ఛిద్రం కావడంతో సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. మరో ముగ్గురు మైనర్లు తీవ్రంగా గాయపడ్డారు. దైదా వెంకటేశ్వరరావు (16), ధారావతు రామ్ చరణ్ (17)లకు గంభీర గాయాలు కాగా, బాలమర్తి చరణ్ తేజ్ (17) పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స కోసం విజయవాడకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీఐ కె. గిరిబాబు, పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తిరువూరు ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే బైక్ పై ఐదుగురు మైనర్లు ప్రయాణించడం, హెల్మెట్‌లు లేకపోవడం వంటి అంశాలు రోడ్డు భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
