పెలికాన్ ప్యారడైజ్‌కు నీటి శాపం

పెలికాన్ ప్యారడైజ్‌కు నీటి శాపం

నీటి లేమితో ఎడారిని తలపిస్తున్న ఆటపాక పక్షుల కేంద్రం
పక్కనే కాలువ నీరు ఉన్నా కేంద్రంలో నిలిచిన దారుణ పరిస్థితి

మండవల్లి, ఆంధ్రప్రభ : ప్రపంచ ప్రసిద్ధ కొల్లేరు సరస్సు పరిధిలోని ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం (పెలికాన్ ప్యారడైజ్) అధికారుల నిర్లక్ష్యంతో ఎడారిని తలపిస్తోందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది వలస పక్షులకు ఆశ్రయంగా నిలిచే ఈ కేంద్రం ప్రస్తుతం నీరు లేక బీటలు వారిపోవడంతో పక్షులు ఆవాసం, ఆహారం కోసం అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది.

పర్యావరణ ప్రేమికులు ప్రొఫెసర్ సుధాబత్తుల విజయకుమార్, కొల్లేరు ప్రేమికుడు ఎల్‌.ఎస్‌. భాస్కరరావు మంగళవారం కేంద్రాన్ని పరిశీలించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “పక్షుల స్వర్గధామం నేడు పక్షుల పాలిట నరకంగా మారింది” అని వ్యాఖ్యానించారు.

కొల్లేరు సరస్సు పరిధిలో 286 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి ప్రతి ఏడాది ఆస్ట్రేలియా, సైబీరియా తదితర దేశాల నుంచి వేలాది వలస పక్షులు వస్తుంటాయి. ముఖ్యంగా అరుదైన పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి కోసం పెద్దఎత్తున ఇక్కడికి చేరుతుండటంతో ఈ ప్రాంతం “పెలికాన్ ప్యారడైజ్”గా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం చెరువు పూర్తిగా ఎండిపోవడంతో చేపలు మృతిచెందుతుండగా, పక్షులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నాయని తెలిపారు.

పక్కనే పోల్రాజ్ కాలువలో నీరు సమృద్ధిగా ప్రవహిస్తున్నా, చెరువులోకి నీటిని మళ్లించడంలో అధికారులు విఫలమయ్యారని వారు ఆరోపించారు. తూములు తెరిచి లేదా మోటార్ల ద్వారా నీరు నింపే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు.

ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నా శాశ్వత పరిష్కారం లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం కేంద్రం గేట్లకు తాళాలు వేసి ఉండటంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారని తెలిపారు. పక్షుల కేంద్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పినా క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులో నీరు నింపి వలస పక్షులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply