ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తారా?: సిపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

ప్రశ్న రావణ్‌పై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్.. ఎస్‌ఐఆర్ గడువు మూడు నెలలు పెంచాలని విజ్ఞప్తి

చల్లపల్లి, ఆంధ్రప్రభ: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై సంకెళ్లు వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలోని శ్రీ చంద్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలపై జరిగిన తీవ్రమైన దాడిగా అభివర్ణించారు. ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ప్రశ్నించే వారిపై రాజద్రోహం వంటి తీవ్రమైన కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం సరైంది కాదన్నారు. విమర్శలను రాజకీయంగా ఎదుర్కోవాల్సింది పోయి పోలీసు వ్యవస్థను ఉపయోగించి భయభ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదని, ప్రజల తరఫున మాట్లాడే గొంతులను కేసులు, అరెస్టులతో అణచివేసే ప్రయత్నాలు చివరకు ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తాయని హెచ్చరించారు. భిన్నాభిప్రాయాలను చర్చల ద్వారా ఎదుర్కోవాల్సిందిపోయి నిర్బంధాలతో సమాధానం చెప్పడం అధికార అహంకారానికి నిదర్శనమన్నారు.

ప్రశ్న రావణ్‌పై నమోదు చేసిన కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, రాజకీయ కక్షసాధింపు చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 14తో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో మరో మూడు నెలల గడువు పొడిగించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 48 శాతం ఓటర్ల నమోదు పూర్తికాలేదని, అందుకే గడువు పెంపు అవసరమన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీఎల్‌వోలు గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ అలాంటి కార్యక్రమాలు జరగలేదని విమర్శించారు. జిల్లా కలెక్టర్లు స్పందించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి 20 కోట్ల ఓట్ల తొలగింపునకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మరణించిన వారి, విదేశాలకు వెళ్లిన వారి ఓట్లను తొలగించడంపై అభ్యంతరం లేదని, కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న నిజమైన ఓటర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. గతంలో ఓటరు నమోదుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు వంటి పత్రాలు ప్రామాణికంగా ఉండేవని, ఇప్పుడు అవి పనికిరావని చెబుతున్నారని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సభ్యత్వ కార్డులే ప్రామాణికమా అని ప్రశ్నించారు.

అయోధ్య రామాలయంలో రూ.200 కోట్ల విలువైన బంగారు ఆభరణాల దొంగతనం జరిగితే దానికి బాధ్యులెవరో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సిపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి శంకర్, జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు, సీనియర్ నాయకుడు మాలెంపాటి కాంచనరావు పాల్గొన్నారు.