నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు…

నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు…
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ నిన్న లోక్ సభలో, నేడు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినందుకు కృషి చేసినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి పార్టీల ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విద్య – ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో గురువారం పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ ని ఆయన కార్యాలయంలో రాజ్యసభ, లోకసభలో కూటమి పార్టీ ఎంపీల బృందం కలిసింది. ప్రధానమంత్రిని నారా లోకేష్ నేతృత్వంలో అమరావతి ప్రాంత విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) తో పాటుగా కలిసిన ఎంపీలు ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలిపారు.
ఐదుకోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంటు ఆమోదం లభించడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి నారా లోకేష్ , సహచర ఎంపీలతో కలిసి కృతజ్ఞతలు తెలియజేసినట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) తెలిపారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన విధంగానే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరితగతిన వచ్చేలా చూడాలని ప్రధానమంత్రిని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం కోరినట్లు శివనాథ్ తెలిపారు.

అదేవిధంగా అమరావతి ప్రాంత అభివృద్ధికి నిధుల కేటాయింపు, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై సైతం ప్రధానితో మంత్రి నారా లోకేష్ తో కలిసి చర్చించినట్లు వివరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోది సైతం మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం విజ్ఞాపనకు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి సైతం తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు ఎంపీ కేశినేని శివనాధ్ వివరించారు.

