ఇంద్రకీలాద్రిపై భక్తి తరంగం..

  • కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తుల పోటెత్తిన రద్దీ..
  • 42,532 మందికి అమ్మవారి దర్శన భాగ్యం
  • రద్దీతో అంతరాలయ, వీఐపీ దర్శనాలు తాత్కాలిక నిలిపివేత..
  • గోసంరక్షణకు రూ.1.01 లక్షల విరాళం..
  • రూ.3.16 లక్షల బంగారు నెక్లెస్ సమర్పణ..
  • భక్తుల కోసం ఆలయ అధికారుల విస్తృత ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి శనివారం భక్తజన సందోహంతో కళకళలాడింది. వారాంతపు సెలవులు, శుభకార్యాల ముహూర్తాలు కలిసి రావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం ఉదయం నుంచే భక్తులతో నిండిపోయింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలను సజావుగా నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో రద్దీ మరింత పెరగడంతో అంతరాలయ దర్శనాన్ని కొంతసేపు నిలిపివేయడంతో పాటు వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. భక్తులందరికీ సాధారణ దర్శనానికి ప్రాధాన్యం కల్పించారు.

ఆలయ వివరాలు ఇలా…

దుర్గగుడి దేవస్థానం అధికారుల సమాచారం లో శనివారం 8,124 దర్శన టికెట్లు జారీ కాగా, మొత్తం 42,532 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 65,412 ప్రసాదాల పంపిణీ చేశారు. హుండీ ద్వారా రూ.4,56,149 విరాళాలు లభించాయి. వివిధ సేవల్లో 358 మంది పాల్గొనగా, 1,657 మంది తలనీలాలు సమర్పించారు. అన్నప్రసాదాన్ని 9,174 మంది భక్తులు స్వీకరించారు.

అమ్మవారికి బంగారు కానుక…

భక్తుల దాతృత్వం కూడా విశేషంగా కనిపించింది. తెనాలికి చెందిన ఆలపాటి శ్రీకర్ దంపతులు ఆలయ గోసంరక్షణ విభాగానికి రూ.1,01,116 విరాళాన్ని సమర్పించారు. దేవస్థానం కల్పిస్తున్న సేవలకు ఆనందం వ్యక్తం చేసిన వారు అమ్మవారికి బంగారు ముక్కుపుడక, బొట్టు, బులాకీ సమర్పించేందుకు సంకల్పించినట్లు తెలిపారు. ఈ విరాళాన్ని ఆలయ అధికారులు, అర్చకుల సమక్షంలో అందజేశారు. అదే రోజు గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన టి. శ్రీధర్ కుటుంబ సభ్యులు అమ్మవారి అలంకరణ కోసం 21 గ్రాముల బరువున్న రూ.3.16 లక్షల విలువైన బంగారు నెక్లెస్‌ను దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు, పర్యవేక్షకుడు నాగేశ్వరరావు సమక్షంలో ఈ నెక్లెస్‌ను సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తుల విశ్వాసం, దాతృత్వంతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉట్టిపడింది.