Congress | పదవుల కోసం పాకులాడుతోన్న కేసీఆర్ కుటుంబం

Congress | పదవుల కోసం పాకులాడుతోన్న కేసీఆర్ కుటుంబం

Congress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, తన కూతురు కవిత అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం సొంత వివాదాలతో సతమతమవుతోందని ఆరోపించారు.

ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం పదవుల కోసం పాకులాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు బీఆర్ఎస్‌ను ఆదరించారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రజలు ఇక బీఆర్ఎస్‌ను విశ్వసించడం లేదని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ఈ క్రెడిట్ మొత్తం సోనియా గాంధీకే దక్కుతుందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం సోనియా గాంధీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే, కేసీఆర్ తన పాలనతో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు.

తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వం దేశంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో రాజ్యాంగ విలువల రక్షణకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.

Leave a Reply