సైకిల్‌పై కొలకపూడి సవారి…

సైకిల్‌పై కొలకపూడి సవారి…
వార్డుల్లో పర్యటన చేసిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు…
‘గుడ్ మార్నింగ్ తిరువూరు’లో ప్రజా సమస్యలపై ఫోకస్…
12, 13వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించిన కొలికపూడి..
అభివృద్ధి పనులపై అధికారులకు ఆదేశాలు..
తిరువూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో నిర్వహించిన “గుడ్ మార్నింగ్ తిరువూరు” కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందన తెచ్చుకుంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం 12వ, 13వ వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ స్థానిక ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే, సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఇంధన కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు కార్లకు బదులుగా సైకిల్‌పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వార్డుల్లో పర్యటించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 13వ వార్డులో ముత్యాలమ్మ గుడి సమీపంలో, ఎన్టీఆర్ విగ్రహం వద్ద బోర్‌వెల్ ఏర్పాటు అంశాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అదే ప్రాంతంలో ఆర్‌సీసీ పైపులు, కనెక్టింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

12వ వార్డులో బోయ బజార్ రోడ్ నుంచి జాస్తి బుల్లెమ్మ నివాసం వరకు ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. జ్యోతి నిలయం వద్ద తాగునీటి అవసరాన్ని గుర్తించి బోర్‌వెల్ ఏర్పాటుపై సంబంధిత శాఖలకు మార్గనిర్దేశం చేశారు. అదే వార్డులోని మసీదు జంక్షన్ వద్ద ప్రమాదకరంగా వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ లైన్, దెబ్బతిన్న ఇనుప విద్యుత్ స్తంభం అంశాలను పరిశీలించిన ఎమ్మెల్యే, ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని అర్బన్ ఏఈ, డీఈ అధికారులకు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు పెద్దలు పాల్గొన్నారు.

