చౌటుప్పల్‌లో ఘనంగా ‘జాతీయ వైద్యుల దినోత్సవం’

చౌటుప్పల్‌లో ఘనంగా ‘జాతీయ వైద్యుల దినోత్సవం’

వైద్యులను సన్మానించిన త్రినిటీ పాఠశాల విద్యార్థులు

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యులు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (బి.సి. రాయ్) జయంతి, వర్ధంతిని పురస్కరించుకుని జులై 1న చౌటుప్పల్‌లో ‘జాతీయ వైద్యుల దినోత్సవాన్ని’ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక త్రినిటీ విద్యాసంస్థల 9వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.
​వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పాండురంగం ఆధ్వర్యంలో విద్యార్థులు వార్డులన్నింటినీ పరిశీలించి, వైద్య సేవలకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి వైద్యులను ఘనంగా సన్మానించి, మిఠాయిలు తినిపించి, పర్యావరణ హితంగా మనీ ప్లాంట్ మొక్కలను బహూకరించారు.

​దేవుడు జీవం పోస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు
అదేవిధంగా తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాటమయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవుడు జీవం పోస్తే, వైద్యుడు పునర్జన్మ ఇస్తాడని కొనియాడారు. వైద్యులు తమ నిద్రాహారాలను సైతం లెక్కచేయకుండా రోగుల బాగోగులు చూస్తారని, అందుకే సమాజంలో వారిని దేవుడితో సమానంగా భావిస్తారని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. త్రినిటీ విద్యాసంస్థలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం విద్యార్థులను ఎంతో ఉత్తేజపరుస్తుందని ఆయన అభినందించారు. ​ఈ కార్యక్రమంలో త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జీని మంజుల, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.