తెలంగాణకు కొత్త సీఎస్ వచ్చేశారు..!

  • కొత్త సీఎస్ సంజయ్ జాజు బాధ్యతల స్వీకారం
  • పదవీ విరమణ చేసిన రామకృష్ణారావుకు ఘన వీడ్కోలు

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సంజయ్ జాజు, ఐఏఎస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన కే. రామకృష్ణారావు, ఐఏఎస్ మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, ఉద్యోగులు నూతన సీఎస్ సంజయ్ జాజును పుష్పగుచ్ఛాలతో అభినందించారు. అదే విధంగా పదవీ విరమణ చేసిన కే. రామకృష్ణారావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు.