ప్రజల్లో ఉంటూ పోరాడితే పదవులు వస్తాయి..
- బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడితే పదవులు అవే వస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు.
మంగళవారం హైదరాబాద్‌లో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులను ఆయన అభినందించారు. తెలంగాణలో బీజేపీ తరఫున కరీంనగర్ కార్పొరేషన్ ఒక్కటే గెలిచిన సందర్భాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సల్, నితిన్ నబిన్‌కు మేయర్, డిప్యూటీ మేయర్లను పరిచయం చేయగా ఆయన వారికి శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం కష్టపడి పనిచేసే నాయకులకు తప్పకుండా పదవులు దక్కుతాయని అన్నారు. కరీంనగర్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. నగర అభివృద్ధి కోసం మరింత శ్రమించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ తదితరులు పాల్గొన్నారు.
