20 ఏళ్లకే “లైఫ్ సెట్” కావాలా..? ఇది మీ కోసమే..!!
- యువత చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదే..!
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : డిగ్రీ పూర్తయింది… ఇంకా ఉద్యోగం రాలేదు!, నా ఫ్రెండ్ సెటిల్ అయిపోయాడు… నేను ఇంకా వెనకే ఉన్నా!, 25 ఏళ్లు వచ్చేశాయి… నా లైఫ్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు!… ఇలాంటి ఆలోచనలు నేటి యువతలో చాలా సాధారణమైపోయాయి. సోషల్ మీడియా, చుట్టుపక్కల వారితో పోలికలు, కుటుంబ అంచనాలు… ఇవన్నీ కలిసి చిన్న వయసులోనే తీవ్ర మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయి.
చాలామంది డిగ్రీ పట్టా చేతికి రాగానే ఉద్యోగం రావాలి.. వెంటనే ఆర్థికంగా స్థిరపడాలి.. కొన్నేళ్లలో ఇల్లు, కారు, మంచి జీతం అన్నీ సాధించాలనే పెద్ద-పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటున్నారు. లక్ష్యాలు ఉండటం మంచిదే కానీ.. వాటిని చేరుకోలేకపోతే నేను విఫలమయ్యాను అనే భావనలో పడిపోవడం ప్రమాదకరం.
నిజానికి పుట్టిన వెంటనే ఏ జీవి పరుగెత్తదు. ముందుగా నడవడం నేర్చుకుంటుంది. పడిపోతుంది.. మళ్లీ లేస్తుంది.. మళ్లీ ప్రయత్నిస్తుంది. అలాగే మనిషి జీవితమూ దశలవారీగా ముందుకు సాగుతుంది. ఒక్క రోజులో విజయం సాధించిన వారు ఎవరూ లేరు. ప్రతి విజయానికి వెనుక ఎన్నో అపజయాలు, ఎన్నో ప్రయత్నాలు దాగి ఉంటాయి.
చాలామంది… ఉద్యోగం వస్తే చాలు… లైఫ్ సెట్ అని అనుకుంటారు. కానీ ఉద్యోగంతో పాటు బాధ్యతలు కూడా మొదలవుతాయి. కుటుంబం, కెరీర్, ఆర్థిక భారం, భవిష్యత్ ప్రణాళికలు… ఒక్కో దశలో కొత్త లక్ష్యాలు వస్తూనే ఉంటాయి. అందుకే జీవితంలో.. ఇది సాధిస్తే ఇక అంతా అయిపోయింది… అనే చివరి గమ్యం అంటూ ఏదీ ఉండదు. ఒక లక్ష్యం నెరవేరితే.. దాన్ని నిలబెట్టుకోవడం మరో లక్ష్యంగా మారుతుంది. ఆ తర్వాత మరింత ఎదగడం ఇంకో లక్ష్యంగా మారుతుంది.
ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి ప్రపంచం మొత్తం తమతోనే పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో స్నేహితుల విజయాలు చూస్తూ.. “అందరూ ముందుకెళ్లిపోయారు.. నేను మాత్రమే వెనకబడ్డాను” అనే భావన కలుగుతుంది. సోదరులు లేదా స్నేహితులు ఉద్యోగాల్లో స్థిరపడితే వారితో పోల్చుకుంటారు. ఒకవేళ ఇంట్లో ఒక్కరే సంతానం అయితే.. “ఇంకా తల్లిదండ్రులకు అండగా నిలవలేకపోయాను” అనే అపరాధ భావన వెంటాడుతుంది. కానీ ఇవన్నీ జీవితంలోని ఒక దశ మాత్రమే అని గుర్తుంచుకోవాలి.
అయితే, నేటి యువతలో మరో ప్రమాదకరమైన ధోరణి కూడా కనిపిస్తోంది. “ఎలాగైనా ఉద్యోగం రావాలి… ఎలాగైనా డబ్బు సంపాదించాలి” అనే ఆత్రుత కొందరిని తప్పుదోవ పట్టిస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాల బాట పడుతున్నారు. కష్టపడి ఎదగాల్సిన వయసులో షార్ట్కట్ల కోసం వెతుకుతూ జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. కొందరు సైబర్ నేరాల్లో చిక్కుకుంటే, మరికొందరు గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడి తమ భవిష్యత్తును తామే చీకటిలోకి నెట్టుకుంటున్నారు.
ఇక, మరోవైపు, ఏఐ వేగంగా విస్తరిస్తుండటంతో యువతలో మరో భయం పెరుగుతోంది. ఉన్న ఉద్యోగాలకే గ్యారెంటీ లేదు… ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అనే ఆందోళన చాలామందిలో కనిపిస్తోంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… ఏఐ కూడా ఒక మనిషి మేధలోంచి పుట్టుకొచ్చిందే. ఆ ఏఐ కూడా అన్నీ చేయలేదు.
అయితే, ఏఐ కొన్ని ఉద్యోగాల మీద ఎఫెక్ట్ చూపించవచ్చు… కానీ, మనిషి సృజనాత్మకత, నాయకత్వం, నిర్ణయ సామర్థ్యం, భావోద్వేగ మేధస్సును పూర్తిగా రీప్లేస్ చేయలేదు. పాత ఉద్యోగాలు తగ్గిన చోటే కొత్త అవకాశాలు కూడా పుడుతుంటాయి. వాటిని అందిపుచ్చుకునే నైపుణ్యాన్ని పెంచుకోవడమే విజయానికి మార్గం.
యువత ఉద్యోగం ఎలా సంపాదించాలి? అనే ఆలోచనతోనే ఆగిపోకూడదు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదగాలి. ఆ లక్ష్యాన్ని కూడా పెట్టుకోవాలి. రేపు నేను ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలను? అనే దిశగా కూడా ఆలోచించాలి. ఉద్యోగం కోసం వేల మందితో పోటీ పడటం గొప్ప విషయం కావచ్చు. కానీ పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం అంతకంటే గొప్ప విజయం.
సింహం కూడా పంజా విసిరే ముందు రెండు, మూడు అడుగులు వెనక్కి వేస్తుంది. అది ఓటమికి కాదు.. మరింత శక్తితో దాడి చేయడానికి. అలాగే జీవితంలో ఎదురయ్యే అపజయాలు, ఆలస్యాలు, నిరాశలు కూడా వెనక్కి లాగడానికి కాదు. మరింత బలంగా ముందుకు దూసుకెళ్లడానికి లైఫ్ ఇచ్చే అవకాశం మాత్రమే. అందుకే నెమ్మదిగా నడవండి… కానీ ఆగిపోవద్దు. ఆలస్యమైనా పర్వాలేదు… కానీ తప్పుడు దారిని ఎంచుకోవద్దు. విజయం కష్టమే… కానీ అసాధ్యం కాదు. జీవితంలో ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి… గివ్అప్ చేయడం మాత్రమే నిజమైన ఓటమి.
జీవితాన్ని ఒక్కో మెట్టుగా చూడాలి. “వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్” అనే సూత్రాన్ని పాటిస్తూ, ఒక్కో లక్ష్యాన్ని ప్రణాళికతో సాధించాలి. జీవితం ఒక గమ్యం కాదు… ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ప్రతి అడుగు ఒక పాఠం… ప్రతి అపజయం ఒక అనుభవం… ప్రతి ప్రయత్నం విజయానికి ఒక మెట్టు. ఇతరులతో పోల్చుకోవడం కంటే.. నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా మారానా లేదా అనేదే అసలు విజయం. జీవితంలో స్థిరపడటం అనేది ఒక గమ్యం కాదు… అది నిరంతరం కొనసాగే ప్రయాణం. చిన్న వయసులోనే అనవసర ఒత్తిడికి గురికాకుండా, ఓపికతో, ప్రణాళికతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది.
