Viral Video | వెనిజువెలాలో వింత…

Viral Video | వెనిజువెలాలో వింత…

Viral Video | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వెనిజువెలా రాజధాని కారకాస్‌లో ఆకాశం ఒక్కసారిగా దట్టమైన ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ అరుదైన ప్రకృతి దృశ్యానికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆకాశంలో చాలా దిగువకు విస్తరించిన ఎర్రటి మేఘాలు కనిపించడంతో పలువురు దీనిని రాబోయే విపత్తుకు సంకేతంగా భావించి భయాందోళనలు వ్యక్తం చేశారు.

ఇటీవల వెనిజువెలాలో సంభవించిన భూకంపాల ప్రభావంతో ఇప్పటికే ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు. అలాంటి సమయంలో ఆకాశం ఒక్కసారిగా రక్తవర్ణంలోకి మారిపోవడం మరింత ఆందోళనకు దారితీసింది. భూకంపాల ధాటికి నష్టపోయిన ప్రాంతాల్లో శిథిలాల వెనుక ఎర్రటి ఆకాశం కనిపించిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

అయితే ఈ ఘటన వెనుక ఎలాంటి అతీంద్రియ శక్తులు లేదా కొత్త ప్రకృతి విపత్తు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సహారా ఎడారి నుంచి గాలుల ద్వారా ప్రయాణించిన సూక్ష్మ ధూళి కణాలు వాతావరణంలోకి చేరడంతో ఈ మార్పు చోటుచేసుకుందని వివరించారు. ఈ ధూళి కణాలు సహజ ఫిల్టర్లుగా పనిచేయడంతో పాటు భౌతిక శాస్త్రంలో ‘రేలీ స్కాటరింగ్’ (కాంతి పరిక్షేపణ) అనే ప్రక్రియ ప్రభావం కూడా ఇందుకు కారణమైందని తెలిపారు.

సాధారణంగా తక్కువ తరంగదైర్ఘ్యం గల నీలిరంగు కాంతి వాతావరణంలో ఎక్కువగా చెల్లాచెదురవుతుంది. అయితే సహారా ధూళి కణాల ప్రభావంతో ఆ కాంతి మరింతగా విక్షేపించబడగా, ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే భూమిని చేరాయి. ఫలితంగా ఆకాశం పూర్తిగా ఎరుపు, నారింజ రంగుల్లో కనిపించిందని నిపుణులు వివరించారు.

ప్రకృతి సృష్టించిన ఈ అరుదైన దృశ్యం ఒకవైపు కనువిందు చేసినప్పటికీ, భూకంపాల బాధ నుంచి ఇంకా కోలుకోని వెనిజువెలా ప్రజల్లో తీవ్ర భయాందోళనను రేకెత్తించింది. ఇదే సహారా ధూళి మేఘాలు త్వరలో అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతం వైపునకు కూడా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.