నూతన కోర్టు భవనాన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న నూతన కోర్టు భవనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి బుధవారం పరిశీలించారు.భవన నిర్మాణ పనుల పురోగతి, కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల ఛాంబర్లు, రికార్డు గదులు, న్యాయవాదుల గదులు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలు తదితర అంశాలను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే ప్రారంభోత్సవ తేదీని తెలంగాణ హైకోర్టుకు నివేదిస్తామని తెలిపారు.

నూతన కోర్టు భవనం అందుబాటులోకి రావడంతో భీమ్‌గల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయని, కేసుల విచారణకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.ఈ పరిశీలనలో ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, ఎంపీడీఓ సంతోష్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ చందర్, ట్రెజరర్ రాజేందర్, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.