ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత పెంచాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు
హనుమకొండ, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత పెంచాలని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్సంపల్లి సంజీవ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం గ్రేటర్ వరంగల్ కొత్తపేటలోని అంబేద్కర్ సెంటర్ వద్ద తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లేకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇస్సంపల్లి సంజీవ మాట్లాడుతూ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించే ప్రయత్నం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేలాది మంది పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడికి తగిన భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రభుత్వం వ్యవహరించి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రతను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీజీపీఏ నాయకులు జన్ను శ్యామ్, రాజేందర్, గ్యాదరి వెంకటేష్, దిలీప్ కుమార్, రాజు, ఐలయ్య, రాకేష్, ఏలియా తదితరులు పాల్గొన్నారు.
