రూ.14,115 కోట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
- ఢిల్లీకి భారీ టన్నెల్ ప్రాజెక్టు
- మోదీ అధ్యక్షతన కీలక నిర్ణయాలు..
- ద్వారకా టన్నెల్, కాన్పూర్-కబ్రాయ్ హైవేకు ఆమోదం…
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.14,115 కోట్ల విలువైన రెండు భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, రైల్వేలు, గ్రామీణ రహదారులు, సముద్ర బీమా రంగాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్ణయాలను వెల్లడించారు.
కేంద్ర ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా 2 శాతం డీఏ (డియర్‌నెస్ అలవెన్స్), డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయంతో 50 లక్షలకుపైగా ఉద్యోగులు, 68 లక్షలకుపైగా పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
ద్వారకా టన్నెల్‌కు ఆమోదం…
ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రూ.6,970 కోట్లతో ద్వారకా టన్నెల్ ప్రాజెక్టు నిర్మించనున్నారు. మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌లో 3.14 కిలోమీటర్ల ట్విన్-ట్యూబ్ అండర్‌గ్రౌండ్ టన్నెల్ ఉండనుంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న శివమూర్తి ఇంటర్‌చేంజ్ నుంచి ప్రారంభమై వసంత్ కుంజ్, నెల్సన్ మండేలా మార్గ్ మీదుగా డీఎన్‌డీ ఫ్లైఓవర్ వరకు ఈ మార్గం విస్తరించనుంది. దీంతో పశ్చిమ ఢిల్లీ, గురుగ్రామ్ నుంచి దక్షిణ, తూర్పు ఢిల్లీకి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. దక్షిణ రిడ్జ్ అటవీ ప్రాంతానికి ఎలాంటి నష్టం కలగకుండా టన్నెల్‌ను పూర్తిగా భూగర్భంలో నిర్మించాలని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆదేశించినట్లు మంత్రి అశ్విన వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు.
యూపీలో మరో హైవే..
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచేందుకు రూ.7,145 కోట్లతో కాన్పూర్–కబ్రాయ్ హైవే ప్రాజెక్టుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
