రైతులను మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- బీఆర్ఎస్ నేత కోల నరేష్
కడెం, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా రైతులను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ కడెం మండల అధికార ప్రతినిధి కోల నరేష్ ఆరోపించారు.
బుధవారం కడెం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రైతులకు ఏడాదికి కేవలం రూ.12 వేల రైతు భరోసా మాత్రమే అందిస్తోందని, అదీ కూడా అర్హులైన రైతులందరికీ కాకుండా కొందరికే పరిమితం చేస్తోందని విమర్శించారు.
రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, రుణమాఫీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. అలాగే వరి కొనుగోలుపై ప్రకటించిన బోనస్‌ను కూడా కొంతమంది రైతులకు మాత్రమే చెల్లించిందని పేర్కొన్నారు.
రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ వంటి పథకాల అమలులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు ఏడాదికి రూ.15 వేల రైతు భరోసా చెల్లించాలని కోల నరేష్ ప్రభుత్వాన్ని కోరారు.
