తెలంగాణ కేబినెట్ భేటీ ఫిక్స్.. !!

  • సీఎం రేవంత్ అధ్యక్షతన ఎల్లుండి కేబినెట్ భేటీ..
  • మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం..
  • అజెండాపై అధికారుల కసరత్తు
  • నివేదికలకు సీఎస్ గడువు
  • అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) అత్యవసర సమావేశం జులై 2న (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం 6వ అంతస్తులో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో ఈ 34వ మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

కేబినెట్ సమావేశం నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు అజెండా అంశాల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అంశాలను సర్క్యులేషన్ ద్వారా ఆమోదించి, తెలుగు అనువాదంతో పాటు సాధారణ పరిపాలన (కేబినెట్) శాఖకు పంపించాలని ఆదేశించారు. ఈ నివేదికలను జులై 1 మధ్యాహ్నం 1 గంటలోపు తప్పనిసరిగా సమర్పించాలని సీఎస్ స్పష్టం చేశారు. అజెండా అంశాలు లేని శాఖలు కూడా ‘నిల్’ నివేదికను అదే గడువులోగా పంపాలని సూచించారు.

కేబినెట్ సమావేశం ముగిసే వరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులందరూ తమ ప్రధాన కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రోటోకాల్, హార్టికల్చర్, సచివాలయ యూనిట్, అనువాద విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో కొనసాగుతున్న పరిపాలనా అంశాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పలు కీలక విధాన నిర్ణయాలు, ఇతర ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.