సునీల్ మృతిపై రాజకీయం..
ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలన్న పెద్ది
రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్..
మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
నర్సంపేట, ఆంధ్రప్రభ: మట్టి రవాణా ఘటనలో మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సొల్లేటి సునీల్ మృతికి స్థానిక ఎమ్మెల్యే రాజకీయంగా, నైతికంగా బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.
బుధవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద సొల్లేటి సునీల్ చిత్రపటానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో మట్టి, మొరం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని, శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు.
అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై పలుమార్లు జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నెక్కొండ మండలంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల పేరుతో పరిమిత అనుమతులు తీసుకుని భారీ స్థాయిలో మట్టి తరలిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఈ అక్రమాలకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని కూడా పేర్కొన్నారు.
సునీల్ మృతిపై ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు న్యాయం కోరుతూ ఆందోళన చేస్తే వారిపైనే పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
నర్సంపేట నియోజకవర్గంలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైందని, ఒకప్పుడు అంతరించిన రౌడీయిజం, అరాచకాలు మళ్లీ తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తప్పుడు కేసులు నమోదు చేస్తున్న అధికారులపై త్వరలోనే వరంగల్ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కోఆర్డినేటర్లు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీలు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నెక్కొండ మండలం, నర్సంపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
