World welfare | మల్లికార్జునుడి బ్రహ్మోత్సవం

World welfare | మల్లికార్జునుడి బ్రహ్మోత్సవం
- శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వైభవంగా ప్రారంభం
World welfare | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున్ స్వామి దేవస్థానంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని పంచాహ్నిక దీక్షతో నిర్వహించపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయని కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 18వ తేదీన ముగియనున్నాయి.
లోక కల్యాణం కోసం నిర్వహించబడుతున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారికి విశేషార్చనలు, మహాశక్తిస్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవగ్రహ మండపారాధనలు, కలశార్చనలు, జపాలు, పారాయణలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఉదయం 9.15 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమ శాస్త్రానుసారం జరిపించబడ్డాయి.
యాగశాల ప్రవేశం
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి, దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏవీ. రమణ, చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు ( అధ్యాపక), అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్దంగా ఆలయప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.
వేదస్వస్తి…
యాగశాల ప్రవేశం చేసిన వెంటనే లోకక్షేమాన్నికాంక్షిస్తూ వేదపండితులు వేదపఠనతో వేదస్వస్తి నిర్వహించారు.
శివసంకల్పం…
వేదస్వస్తి తరువాత దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురువాలని, దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోక కల్యాణ సంకల్పాన్ని చెప్పారు.
గణపతిపూజ..
సంకల్పపఠనం తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను చేయడం జరిగిందన్నారు..
చండీశ్వరపూజ…
గణపతిపూజ తరువాత శివ సంచార దేవతలలో ఒకరైన చండీశ్వరునికి విశేషపూజ జరిపించబడింది. ఈ చండీశ్వరుడు స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాటు చేస్తూ ఉత్సవాలను నిర్వహిస్తాడని చెప్పబడుతోందన్నారు.
కంకణపూజ – కంకణ ధారణ
చండీశ్వర అర్చన తరువాత కంకణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించబడ్డాయి. అనంతరం అధికారులు, అర్చకస్వాములు, స్థానాచార్యులు కంకణాలను ధరించారు.
ఋత్విగ్వరణం…
కంకణధారణ తరువాత ఋత్విగ్వరణం నిర్వహించబడింది. బ్రహ్మోత్సవాలలో ఆయా వైదిక కార్యాలను నిర్వహించామని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేర్కొన్నారు.
అఖండదీప స్థాపన
అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తు హోమం జరిపించబడ్డాయి. వాస్తు హోమం తరువాత మండపారాధన, పంచావరణార్చన, ప్రధాన కలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
సాయంకాలం కార్యక్రమాలు ఇవే..
అంకురార్పణ..
ఈ రోజు సాయంకాలం అంకురార్పణ జరిపించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత ప్రదేశంలోని మట్టిని సేకరించి సంప్రదాయబద్ధంగా యాగశాలకు తీసుకువస్తారు. తరువాత ఈ మట్టిని 9 పాలికలలో (మూకుళ్లలో) నింపి దాంట్లో నవధ్యానాలు పోసి ఆ మట్టిని మొలకెత్తించే పనిని ప్రారంభిస్తారు. ఈ పాలికలలో రోజు నీరు పోసి నవధ్యానాలు పచ్చగా మొలకెత్తేలా చేస్తారు. ఈ విధంగా అంకురాలను ఆరోరింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు.
ధ్వజారోహణ..
అంకురార్పణ తరువాత జరిగే ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభం మీద పతావిష్కరణ చేయడమే “ధ్వజారోహణ”. ఈ కార్యక్రమంలో ఒక కొత్తవస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుని, అష్టమంగళ చిత్రాలను చిత్రీకరిస్తారు. దీన్నే‘నందిధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన తాడును సిద్ధం చేస్తారు.
ఈ నంది ధ్వజపటాన్ని ఊరేగింపుగా, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, చండీశ్వరస్వామి సమక్షంలో పూజాదికాలను నిర్వహిస్తారు. ధ్వజారోహణలో భాగంగానే భేరీ పూజ కూడా నిర్వహించబడుతుంది. ఈ భేరీ పూజలో డోలు వాద్యానికి పూజాదికాలు జరుగుతాయి. తరువాత నాదస్వరంపై ఆయా రాగాల ఆలాపనతో దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.
చివరగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే ఈ నంది పతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానం అన్నమాట. ఈ ఆహ్వానంతో విచ్చేసిన దేవతలకు నిర్ణీత స్థలాలు కేటాయించి రోజూ విధివిధానంగా వారికి నివేదన సమర్పిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో సకల దేవతలు క్షేత్రంలోనే ఉంటూ ఉత్సవాలను తిలకిస్తారని ఆగమశాస్త్రాలు పేర్కొంటున్నాయి.
రేపటి కార్యక్రమాలు…
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు, చండీశ్వరపూజ, మండపారాధనలు, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రహోమం, సాయంకాల నిత్యహవనాలు జపాలు, పారాయణలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడుతాయన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా రేపు సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ ఊరేగింపు జరిపించబడుతుందన్నారు.
