సంపూర్ణ మద్యపాన నిషేధానికి గ్రామపంచాయతీ తీర్మానం
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ: నల్లగొండ మండలం దీపకుంట గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ఈ మేరకు గ్రామంలోని బెల్ట్ షాపులను మూసివేసి మద్యపాన నిషేధానికి సహకరించేలా నిర్వాహకులను ఒప్పించినట్లు సర్పంచ్ గూడూరు అజేందర్ రెడ్డి తెలిపారు. ఐదు రోజుల క్రితమే గ్రామపంచాయతీ తీర్మానం చేసినట్లు వెల్లడించారు.
మంగళవారం గ్రామపంచాయతీ తీర్మాన ప్రతులను బెల్ట్ షాపుల నిర్వాహకులు, రూరల్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులకు అందజేశారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు యువత సన్మార్గంలో ఉండేలా, పచ్చని పల్లెగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తెల్లమల్ల నరేష్, పంచాయతీ కార్యదర్శి సునీత, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
