Pawan Kalyan | పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత…

ప్రకృతిలో అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థల్లో చిత్తడి నేలలు ప్రధానమైనవని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. నేడు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవమని గర్తు చేస్తూ.. పర్యావరణంలో చిత్తడి నేలల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని.. ఇవి సహజ నీటి శుద్ధి కేంద్రాలని తెలిపారు.

ఈరోజు(శనివారం) ఏపీ సచివాలయంలో మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణపై కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 25,000కు పైగా చిత్తడి నేలలు ఉన్నాయని చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలని చెప్పారు. ఈ భూములు భూకంప ఉద్ధృతిని తగ్గించడంలో, వాతావరణ మార్పులను నియంత్రించడంలో, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పవన్ కల్యాణ్ చెప్పారు.

రామ్‌సర్ సైట్‌గా గుర్తింపు పొందిన భారతదేశంలోని అతి పెద్ద తీపినీటి సరస్సుల్లో ఒకటి కొల్లేరు సరస్సు అని అన్నారు. అలాగే, దేశంలో రెండో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ సరస్సు అని చెప్పారు. సముద్ర జీవజాలానికి కీలకమైన ఉప్పుటేరు వాతావరణ వ్యవస్థ కూడా ఉన్నాయని అన్నారు.

ఈ భూములు పక్షుల సంరక్షణకు, మత్స్య సంపదకు మాత్రమే కాదని వ్యవసాయానికి ఉపయోగపడుతూ వేలాది మంది ప్రజలకు జీవనాధారం అందిస్తున్నాయని పవన్ కల్యాణ్ వివరించారు. ఈ విలువైన వనరులను రక్షించడానికి మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని అన్నారు.

ఆక్రమణల నివారణకు, భౌగోళిక సరిహద్దుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, మనందరి బాధ్యత అని.. దానిని కాపాడుకోవ‌డానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వప్రయోజనాలు తగ్గించుకోవడం ద్వారానే ప్రకృతిని రక్షించగలమని చెప్పారు. ప్రతి చిన్న ప్రయత్నమూ సమిష్టిగా ప్రారంభమైతే పెద్ద మార్పుకు దారి తీస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *