చిట్యాలలో యూరియా సబ్ సెంటర్ ప్రారంభం

రైతులకు రవాణా ఇబ్బందులు తొలగింపు..

సర్పంచ్ రంజిత్ రెడ్డి కృషితో అందుబాటులోకి సబ్ సెంటర్

తాడ్వాయి, ఆంధ్రప్రభ: చిట్యాల, సంతాయిపేట్ గ్రామాల రైతులకు యూరియా కోసం రవాణా ఇబ్బందులు ఎదురుకాకుండా చిట్యాలలో యూరియా సబ్ సెంటర్‌ను ప్రారంభించినట్లు మండల వ్యవసాయ అధికారి నర్సింలు, అరగొండ సొసైటీ చైర్మన్ కంది శివరాములు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిట్యాల సబ్ సెంటర్‌కు తొలి విడతగా 886 యూరియా బస్తాలు చేరాయని తెలిపారు. రైతులు యాప్‌లో ముందస్తుగా బుకింగ్ చేసుకుని రేపటిలోగా యూరియాను పొందాలని సూచించారు.

ఆగస్టు 6 నుంచి కొత్త ఎఫ్‌ఎఫ్‌ఎస్ (Framework Fertilizer Sale) సెంట్రల్ యాప్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రైతులు ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఈ యాప్ ద్వారా యూరియాతో పాటు డీఏపీ, పొటాష్, సూపర్ ఫాస్ఫేట్, కాంప్లెక్స్ ఎరువులు వంటి సాధారణ ఎరువులను కూడా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

చిట్యాలలో యూరియా సబ్ సెంటర్ ఏర్పాటు కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, అధికారులతో చర్చించి సబ్ సెంటర్ ఏర్పాటు కోసం కృషి చేశారని తెలిపారు. ఏఎంసీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి సహకారంతో ఈ కేంద్రం అందుబాటులోకి రావడం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామ ప్రజలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి, సంతాయిపేట్ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నర్సింలు, ఏఈఓ అశోక్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, అరగొండ సొసైటీ చైర్మన్ కంది శివరాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవులు, సీనియర్ నాయకుడు సుధాకర్ రావు, మేకల రాజు, వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ మల్లేష్, సంతాయిపేట్ ఉపసర్పంచ్ సతీష్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మ్యడం పెద్ద బాలయ్య, ఉపాధ్యక్షుడు గైని సాయిలు, విట్టల్, కంది రాజం, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.