విజయవాడ రైల్వే డివిజన్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం

విజయవాడ రైల్వే డివిజన్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం

కేదరేశ్వరపేట, ఆంధ్రప్రభ: విజయవాడ డివిజన్ ప్రధాన కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై గత కొన్ని రోజులుగా చేపట్టిన విస్తృత అవగాహన ప్రచారం ఈ వేడుకలతో విజయవంతంగా ముగిసింది.

ఈ కార్యక్రమానికి విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఇన్‌ఫ్రా పి.ఇ. ఎడ్విన్, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆపరేషన్స్ కొండ శ్రీనివాసరావు, బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు.

ఎన్విరాన్‌మెంట్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో డివిజన్ సాధించిన కీలక విజయాలను వివరించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అధికారులకు తెలియజేశారు.

రైల్వే బోర్డు ఆదేశాల మేరకు మే 15 నుంచి జూన్ 5 వరకు డివిజన్ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో రైల్వే ఉద్యోగులు, విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ ప్రచారంలో భాగంగా పర్యావరణ బాధ్యతను పెంపొందించేందుకు 43 ప్రాంతాల్లో పర్యావరణ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్త పిలుపైన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1,060 మొక్కలు నాటారు.

డివిజన్ పరిధిలో 158 పర్యావరణ అవగాహన కార్యక్రమాలు, 25 ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు 27 సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టారు.

వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ‘నుక్కడ్ నాటక్’ వీధి నాటకం ప్రదర్శించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ భాగస్వామ్యంతో వివిధ పోటీలు నిర్వహించారు.

డివిజన్ హరిత కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన 15 మంది సిబ్బందిని డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

అదే సందర్భంలో వివిధ విభాగాల్లో చేపట్టిన పర్యావరణ అనుకూల పద్ధతులు, వ్యర్థాల నిర్వహణ నమూనాలు, వనరుల పరిరక్షణకు సంబంధించిన వార్షిక బ్రోచర్‌ను డీఆర్‌ఎం ఆవిష్కరించారు.

Leave a Reply