నిరుద్యోగ యువతకు శుభవార్త.. గుడివాడలో భారీ జాబ్ మేళా
గుడివాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29న గుడివాడలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు.
గుడివాడలోని రెడ్ సన్ ఫౌండేషన్, ముగ్గు బజార్ సెంటర్, బ్రహ్మకుమారి సమాజ మందిరం వెనుక వైపు, పాత కరెంటు ఆఫీస్ రోడ్డులో మే 29న ఉదయం 9 గంటలకు ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ జాబ్ మేళాలో ఎఫ్ట్రానిక్స్, డామినీర్, టాటా ఎలక్ట్రానిక్స్, ముత్తూట్ ఫైనాన్స్, జోయాలుక్కాస్, అపోలో టైర్స్, ఇన్నోవ్‌సోర్స్, వరుణ్ మోటార్స్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, పేటీఎం సర్వీసెస్ సహా 10కు పైగా ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్ కుమార్ తెలిపారు.
మొత్తం 510కు పైగా ఖాళీల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలతో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు చెప్పారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు వివరించారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా నైపుణ్యం పోర్టల్ లో తమ పూర్తి వివరాలతో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు హాజరయ్యేటప్పుడు రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్, పాన్ కార్డు, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 98488 19682, 95732 78755 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
