పునరుత్పాదక ఇంధనంలో ఏపీని టాప్ లో నిలుపుతాం…

పత్తికొండ పౌరుషానికి, ఆత్మీయతకు ప్రతీక


కర్నూలు బ్యూరో, జులై 30( ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యుత్, పరిశ్రమలు, ఉపాధి, విద్య, వైద్యం వంటి అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

పత్తికొండ పౌరుషాల గడ్డ.. యువతకు భారీగా ఉద్యోగాలు…
పత్తికొండ పౌరుషానికి, ఆత్మీయతకు ప్రతీక అని లోకేష్ కొనియాడారు. పాదయాత్ర సమయంలో ఈ ప్రాంత ప్రజలు చూపించిన ప్రేమ, అందించిన మద్దతును జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపారు. పత్తికొండ నియోజకవర్గం బంగారు గడ్డ అని, ఇటీవలె ముఖ్యమంత్రి గారు జొన్నగిరిని ‘స్వర్ణగిరి’గా నామకరణం చేశారని గుర్తుచేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ భాగస్వామ్యంతో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ పత్తికొండ ప్రాంతంలోనే రూపుదిద్దుకుంటోందని, దీనిద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

పరిశ్రమలకు చిరునామాగా కర్నూలు జిల్లా…
పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ తో కలసి ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని లోకేష్ వెల్లడించారు. రిలయన్స్, డ్రోన్ సిటీ, ఫార్మా రంగానికి చెందిన ప్రముఖ పరిశ్రమలతో పాటు తాజాగా పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం రాయలసీమకు తీసుకొచ్చిందని తెలిపారు.

నిర్మాణ అండ్ ఇన్స్టాలేషన్ సమయంలో సుమారు 4,000 మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. 800 మెగావాట్ల ఇంధన ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1,100 రైతు కుటుంబాలకు 30 ఏళ్ల పాటు నేరుగా తమ ఖాతాల్లో లీజు ప్రాతిపదికన ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, యూనిట్‌కు 13 పైసల చొప్పున విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. యువగళం పాదయాత్రలో లాయర్లకు ఇచ్చిన మాట ప్రకారం, రాబోయే 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు.

యువతకు నైపుణ్య శిక్షణ – స్విట్జర్లాండ్ సంస్థల భాగస్వామ్యం
యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు రాష్ట్రంలోని ఐటీఐలను బలోపేతం చేస్తున్నామని, స్విట్జర్లాండ్‌కు చెందిన సుజ్లాన్ (Suzlon) వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని వివరించారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే 1,200 మందికి ఉపాధి లభించిందని, భవిష్యత్తులో మరింత మందికి నైపుణ్య శిక్షణతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

రష్యా, కొరియా పర్యటనలు – ఏపీకి పెట్టుబడుల వరద
యువగళం పాదయాత్రలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకునేందుకు తాము రష్యా, దక్షిణ కొరియా, అమెరికా, యూరప్ వంటి అనేక దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నామని లోకేష్ తెలిపారు.

ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన రంగంలో గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రల తర్వాత ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందన్న ఆయన.. త్వరలోనే ఏటా 10,000 మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థ్యాన్ని జోడించి ఏపీని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టాటా పవర్ సీఈఓ అండ్ ఎండి డాక్టర్ ప్రవీణ్ సిన్హాతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, యువకులు పాల్గొన్నారు.