Vijayawada రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా అభివృద్ధి..
Vijayawada రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా అభివృద్ధి..
- ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం: సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాథూర్
ఎన్టీఆర్ బ్యూరో( Vijayawada), ఆంధ్రప్రభ: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా ఆధునికీకరిస్తున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ పేర్కొన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ–గూడూరు రైల్వే మార్గాన్ని శుక్రవారం ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఈ పర్యటనలో విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా సహా దక్షిణ తీర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కృష్ణా కెనాల్ జంక్షన్–పెదవడ్లపూడి జంక్షన్ మధ్య కొనసాగుతున్న మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, పనుల నాణ్యత, పురోగతిని సమీక్షించి వేగవంతం చేయాలని ఆదేశించారు. భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. తెనాలి రైల్వే స్టేషన్‌లో టికెటింగ్ కౌంటర్లు, వేచివుండే హాళ్లు, పార్కింగ్ సౌకర్యాలను పరిశీలించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
బాపట్ల రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి నాణ్యత, భద్రత ప్రమాణాల్లో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. చీరాల రైల్వే స్టేషన్‌లో సిగ్నలింగ్ వ్యవస్థ, యార్డ్ పనులను పరిశీలించారు. ఒంగోలు రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన ఆయన, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. నెల్లూరు స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాలు, దివ్యాంగుల సదుపాయాలు, సర్క్యులేటింగ్ ఏరియా పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
బిట్రగుంటలో క్రూ లాబీని పరిశీలించిన ఆయన, రన్నింగ్ సిబ్బంది భద్రత, విశ్రాంతి సౌకర్యాలను సమీక్షించారు. సిబ్బంది సంక్షేమం రైల్వే సేవల నాణ్యతకు కీలకమని పేర్కొన్నారు. ఈ పర్యటనలో రైల్వే ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

