హైబ్రిడ్ మహానాడుతో పసుపు జోష్..

హైబ్రిడ్ మహానాడుతో పసుపు జోష్..
ఎ.కొండూరు మండలం గోపాలపురంలో ఉత్సాహ వాతావరణం
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎ.కొండూరు మండలంలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. గోపాలపురం ఎస్‌ఎన్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమం పూర్తిగా పసుపుమయ వాతావరణంలో సాగింది.
మహానాడు వేదికపై ఎన్టీఆర్ చిత్రపటానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా మంగళగిరిలో జరుగుతున్న ప్రధాన మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మండల టీడీపీ అధ్యక్షుడు భరోతు పీక్లా నాయక్ మాట్లాడుతూ, హైబ్రిడ్ విధానం ద్వారా మహానాడును నిర్వహించడం ద్వారా డిజిటల్ విప్లవానికి నాంది పలికినట్లైందన్నారు. ఇంధన వినియోగం తగ్గడంతో పాటు, ఎక్కువ మంది కార్యకర్తలు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లభించిందని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధికార ప్రతినిధి అలవాల రమేష్ రెడ్డి మాట్లాడుతూ మహానాడు పార్టీకి దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సందేశాలను కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ, సామాజిక సమతుల్యత అంశాలపై మహానాడులో విస్తృత చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా వేదిక వద్ద టీడీపీ జెండా ఆవిష్కరణ, ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు మహానాడు కొనసాగనున్నట్లు నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, గ్రామ స్థాయి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
