ఆటోనగర్ చెత్త సమస్యకు చెక్
- జిందాల్ ప్లాంట్‌కు నేరుగా చెత్త తరలింపు
- నూతన కంపాక్టర్‌ను ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ నగరంలోని ఆటోనగర్ ప్రాంతంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కీలక చర్యలు చేపట్టింది. గురువారం ఆటోనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 42 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల కంపాక్టర్‌ను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటోనగర్‌లో రోజువారీగా సేకరించే చెత్తను నేరుగా జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌కు తరలించే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కంపాక్టర్ ద్వారా వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరిగి పరిసరాల పరిశుభ్రత మెరుగుపడుతుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన నిధుల్లో 50 శాతం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అందించినట్లు వెల్లడించారు. ఆటోనగర్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు, టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్ తదితరులు చెత్త సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, వెంటనే సంబంధిత శాఖలతో సమన్వయం ప్రారంభించినట్లు వివరించారు.జిందాల్ ప్లాంట్ యాజమాన్యం, మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ, ఎంఏయూడీ శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్రలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉత్పత్తి అయ్యే చెత్తను జిందాల్ ప్లాంట్‌కు తరలించేందుకు అంగీకారం లభించినట్లు వెల్లడించిన పట్టాభిరామ్, త్వరలో ఆటోనగర్ పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మరిన్ని సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.చెత్త ఏ రోజూ పేరుకుపోకుండా అదే రోజు తరలించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఆటోనగర్‌లో చెత్త సమస్య మళ్లీ పునరావృతం కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అలాగే ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎండీ ఏఎస్ దినేష్ కుమార్, జోనల్ మేనేజర్ కుంచె బాబ్జీలతో చర్చించి ట్రాన్స్‌పోర్ట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్టర్ స్టేషన్‌ను అనుకూలమైన మరో ప్రదేశానికి తరలించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ వాటి పరిష్కారానికి తోడ్పడుతున్న మీడియా ప్రతినిధులను ఈ సందర్భంగా పట్టాభిరామ్ అభినందించారు.ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ కుంచె బాబ్జీ, గద్దె క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
