Chinta Prabhakar | జగ్గారెడ్డి.. దమ్ముంటే ఇంటి దొంగ పేరు బయటపెట్టు

  • మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై సిట్ విచారణ వేయాలి
  • ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్
  • స‌న్నిహితుడే వెన్నుపోటుదారుడంటూ విమ‌ర్శ‌లు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : జగ్గారెడ్డి.. దమ్ముంటే ఇంటి దొంగ పేరు బయటపెట్టు అని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స‌వాల్ విసిరారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

మీనాక్షి నటరాజన్‌కు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీలోని నాయకులే అనే ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయ‌న ప‌లు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. జాతీయ పార్టీ ఇన్‌చార్జి స్థాయి నాయకురాలి అఫిడవిట్‌లో తప్పులు జరగడం కాంగ్రెస్ వైఫల్యమేనని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా చెబుతున్న వ్యక్తే మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచాడనే ఆరోపణలపై కాంగ్రెస్ ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలను దాచిపెట్టేందుకే బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వ‌ల్లే..

మధ్యప్రదేశ్ మంత్రులు ఆధారాలతో సహా తెలంగాణ కాంగ్రెస్ నాయకులే సమాచారం ఇచ్చారని చెబుతున్నప్పటికీ, దానిపై కాంగ్రెస్ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హరీష్ రావు విమర్శలు ఊహాగానాలు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అంశాలను ఆధారాలతోనే ప్రజల ముందుకు తీసుకొస్తున్నారని చింతా ప్రభాకర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లోని కోవర్టుల వ్యవహారాన్ని బయటపెట్టినందుకే హరీష్ రావుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సిట్ విచారణకు ఆదేశించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వర్గమే ఆమెకు ద్రోహం చేసిందని ప్రచారం జరుగుతుంటే జగ్గారెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

రూ.100 కోట్లతో నిర్మిస్తున్న సీఎం గెస్ట్ హౌస్, యూనిఫామ్ టెండర్లు, ప్రభుత్వ వ్యయాలు, హెలికాప్టర్ అద్దె ఖర్చులపై హరీష్ రావు లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కోరారు. సంగారెడ్డిలో ప్రజల చేతిలో ఓటమి పాలైన జగ్గారెడ్డికి, ఆరు సార్లు ప్రజల మద్దతుతో గెలిచిన హరీష్ రావును విమర్శించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు.

రైతులు, పేదలు, యువత సమస్యలపై సమాధానం చెప్పకుండా పదవుల రాజకీయాలకే కాంగ్రెస్ నాయకత్వం పరిమితమైందని విమర్శించిన ఆయన, ఫార్మాసిటీ రద్దుతో రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, ఉద్యోగాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆరోపించారు. నిజంగా దమ్ముంటే మీనాక్షి నటరాజన్‌కు సీటు రాకుండా అడ్డుకున్న కోవర్టు పేరు జగ్గారెడ్డి బయటపెట్టాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సవాల్ విసిరారు.