గాలి బీభత్సంతో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..
వెల్దండ, ఆంధ్రప్రభ : గత వారం కురిసిన గాలి బీభత్సం కారణంగా మండల సమీపంలోని పలు గ్రామ పంచాయతీలలో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతులు చేపట్టి అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
అయితే వెల్దండ మండల పరిధిలోని గానుగట్టు తండా గ్రామ పంచాయతీలోని ఇసుకబోడు తండాలో గాలి వాన ప్రభావంతో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. దీంతో త్రాగునీటి సమస్యలు తీవ్రతరమవడంతో పాటు మూగజీవాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పంటలు చేతికొచ్చే దశలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దెబ్బతినడంతో పంటలు ఎండిపోతున్నాయని, భారీ నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఫోన్ ద్వారా సమస్యను వివరించినట్లు తెలిపారు. ఆయన వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
అయితే హామీలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పనులు ఆలస్యమవుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
