Saraswati Pushkaralu | పవిత్ర స్నానం ఆచరించిన వివేక్ వెంకటస్వామి

Saraswati Pushkaralu | పవిత్ర స్నానం ఆచరించిన వివేక్ వెంకటస్వామి
Saraswati Pushkaralu | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి కాలేశ్వరంలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో పాటు భజన బృందాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈవో, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కాలేశ్వరం తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలు భక్తులకు అత్యంత పవిత్రమైన అవకాశమని, ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరాల్లో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
