దళారుల చేతిలో మోసపోయిన రైతులకు అండగా ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లి మండలంలో దళారి వ్యాపారుల చేతిలో మోసపోయిన రైతులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గురువారం పరామర్శించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

మొక్కజొన్న పంటను విక్రయించిన రైతులకు దళారులు చెల్లించాల్సిన సుమారు రూ.90 లక్షలను వసూలు చేసి బాధితులకు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సైకి ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బిజినేపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను పలువురు దళారులకు విక్రయించగా, డబ్బులు చెల్లించకుండా వారు పరారైనట్లు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులను వదిలిపెట్టబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఓ రైతు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోగా, ఎమ్మెల్యే ఆయనను ఓదార్చారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, లైసెన్స్ లేని వ్యాపారులతో లావాదేవీలు చేయకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించి ఉంటే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కాదని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం కూడా దళారులను అదుపులోకి తీసుకుని రైతులకు రావాల్సిన డబ్బులు త్వరలోనే అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.