Nagarkurnool క్రీడాకారులకు మంత్రి జూపల్లి అపూర్వ కానుక

Nagarkurnool క్రీడాకారులకు మంత్రి జూపల్లి అపూర్వ కానుక

  • మినీ స్టేడియం కోసం రూ.1.50 కోట్ల విలువైన 4 ఎకరాల భూమి విరాళం

Nagarkurnool నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ

ప్రజా సంక్షేమం, నిజాయితీ, విలువలను తన రాజకీయ జీవితానికి మూల సూత్రాలుగా మలుచుకున్న పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి ఆదర్శంగా నిలిచారు. స్థానిక క్రీడాకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సుమారు రూ.1.50 కోట్ల విలువైన తన 4 ఎకరాల సొంత భూమిని మినీ స్టేడియం నిర్మాణం కోసం విరాళంగా అందజేశారు.

కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వీపనగండ్ల మండల కేంద్రంలో ఉన్న తన సొంత భూమిని క్రీడా మైదానం కోసం ప్రభుత్వానికి బదిలీ చేస్తూ బుధవారం కోడేరు మండల తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా డిజిటల్ సంతకం చేశారు.

గతంలో వీపనగండ్ల మండల పర్యటన సందర్భంగా స్థానిక యువత, క్రీడాకారుల అభ్యర్థన మేరకు మినీ స్టేడియం ఏర్పాటు కోసం తన సొంత భూమిని కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వీపనగండ్ల మండల కేంద్రంలోని సర్వే నంబర్ 532/ఏ పరిధిలో తన పేరిట ఉన్న 4 ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వానికి బదిలీ చేశారు.

కోడేరు తహసీల్దార్ కార్యాలయంలో వీపనగండ్ల ఎంఆర్‌వో డిజిటల్ లాగిన్ ద్వారా ఈ భూమిని మినీ స్టేడియం కోసం కేటాయిస్తూ అధికారిక ప్రక్రియను పూర్తి చేశారు.

ఈ చారిత్రాత్మక భూ బదలాయింపు ప్రక్రియకు సాక్షులుగా వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మునిగొండ గోపి, నాగర్‌కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ డిజిటల్ సంతకాలు చేశారు.

క్రీడల అభివృద్ధి, గ్రామీణ యువత భవిష్యత్తు కోసం కోట్ల రూపాయల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును పలువురు అభినందించారు. మంచి మనసున్న నాయకుడిగా ప్రశంసలు కురిపిస్తూ స్థానిక ప్రజలు, క్రీడాకారులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.