శేషు కుమార్ సేవలకు ట్రస్మా ఘన నివాళి
- బడ్జెట్ స్కూళ్లకు అండగా నిలిచిన శేషు కుమార్‌కు ఘన నివాళి
- నాలుగో వర్ధంతి సభలో స్ఫూర్తిదాయక సేవలను స్మరించిన ట్రస్మా నాయకులు
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ: బడ్జెట్ ప్రైవేటు పాఠశాలల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన దివంగత ట్రస్మా రాష్ట్ర నాయకుడు సూరపనేని శేషు కుమార్ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరంలోని ట్యాంక్‌బండ్ గెరిల్లా ఫంక్షన్ హాల్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన స్మారక సభలో వారు మాట్లాడారు.
శేషు కుమార్ బడ్జెట్ స్కూళ్ల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని, ఆయన చూపిన మార్గం ప్రైవేటు విద్యాసంస్థలకు ఆదర్శమని పేర్కొన్నారు. విద్యా రంగానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
సభ ప్రారంభంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు శేషు కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ట్రస్మా ఆధ్వర్యంలో ‘మేనేజ్‌మెంట్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’ నిర్వహించారు. ముఖ్య వక్తలుగా పాల్గొన్న ఇనుగంటి ప్రసాద్‌రావు, కాకర్ల బాలప్రసన్న భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలతో పాఠశాల నిర్వహణ అంశంపై ప్రజెంటేషన్లు ఇచ్చారు.
ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, అధ్యాపకుల కుటుంబాలకు ట్రస్మా తరఫున చెరో రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు శివరాత్రి యాదగిరి, ఐ.వి. రమణరావు, కేసి వీరన్న, శశిధర్ రెడ్డి, శంకరయ్య, ప్రవీణ్, ఇస్మాయిల్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుర్రం కాంతారావు, జిల్లా కార్యదర్శి నాయుడు వెంకటేశ్వర్లు, కోశాధికారి నాసరయ్య, అడ్వైజర్ సంక్రాంతి రవికుమార్, టీవీ అప్పారావు, మతిన్, సూరిబాబు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్వ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పెద్ద సంఖ్యలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సభకు హాజరయ్యాయి.
