లారీ వివాదం నేపథ్యంలో దంపతుల ఆత్మహత్యాయత్నం
ఉయ్యూరు టౌన్, ఆంధ్రప్రభ: లారీ కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదం, పలు పోలీస్ స్టేషన్లలో జరిగిన విచారణల నేపథ్యంలో తాము తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యామని ఆరోపిస్తూ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం ఉయ్యూరులో చోటుచేసుకుంది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన వినాయక్బాబు భీమవరానికి చెందిన కుమార్ వద్ద ఫైనాన్స్ పద్ధతిలో లారీ కొనుగోలు చేశారు. లారీని కొనుగోలుదారుడి పేరుపై మార్చేందుకు 40 రోజుల గడువుతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. ఆ ఒప్పందంపై నమ్మకంతో లారీ మరమ్మతులకు రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేసినప్పటికీ, గడువు ముగిసిన తర్వాత కూడా లారీని తమ పేరుపై మార్చలేదని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై తొలుత భీమవరం పోలీస్ స్టేషన్లో, అనంతరం పడమట, పెనమలూరు పోలీస్ స్టేషన్లలో విచారణ జరిగినట్లు బాధితులు తెలిపారు. పెనమలూరు పోలీస్ స్టేషన్లో రెండు రోజుల పాటు విచారణ జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
అలాగే, ఈ వ్యవహారంలో కుమార్ భార్య ఎక్సైజ్ కానిస్టేబుల్ సహా కొందరి కారణంగా తమపై ఒత్తిడి, వేధింపులు జరిగాయని బాధితులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో కూడా తమతో దురుసుగా ప్రవర్తించి, బెదిరించారని వారు తెలిపారు.
ఈ పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురైన వినాయక్బాబు ఉయ్యూరులోని పుల్లేరు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు రక్షించినట్లు సమాచారం. మరోవైపు ఆయన భార్య ఎలుకల మందు తీసుకున్నట్లు తెలిసింది. ఆమెను వెంటనే ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా, బాధితులు చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారుల స్పందన అందాల్సి ఉంది.
