మూడు రోజుల శిశువు అక్రమ విక్రయం.. ముగ్గురు అరెస్టు
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడలో శిశువుల అక్రమ కొనుగోలు–అమ్మకాల వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. రూ.6.59 లక్షలకు మూడు రోజుల వయసున్న ఆడ శిశువును కొనుగోలు చేసిన కేసులో దంపతులతో పాటు ఓ మధ్యవర్తిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణలంకలోని రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో కృష్ణారెడ్డి, శివపార్వతి దంపతులతో పాటు బీహార్‌కు చెందిన సయ్యద్ ఆలంను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు రోజుల వయసున్న ఆడ శిశువును పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో పిల్లలు లేకపోవడంతో ఢిల్లీకి చెందిన ఓ మహిళ ద్వారా రూ.6.59 లక్షలు చెల్లించి శిశువును కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో శిశువును విక్రయించిన మహిళతో పాటు ఇతరుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ శిశు విక్రయ ముఠా కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
