మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాల జోరు
- 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
- రైతులకు ఊరటనిచ్చిన ఐఎండీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో సోమవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఐఎండీ అంచనాల ప్రకారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట, జనగాం, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర మొత్తం 18 జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కొద్ది రోజులుగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురవడంతో అనేక జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. సాగు కోసం ఎదురుచూస్తున్న రైతులు వర్షాల కోసం ప్రత్యేక పూజలు, కప్పతల్లి ఆటలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల వర్షాల సూచన రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోయిన్పల్లి, ఈసీఐఎల్, కాచిగూడ, మలక్‌పేట్, ఉప్పల్, మణికొండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
వర్షాలతో జోరందుకున్న వరి నాట్లు
ఇటీవల కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వరి నాట్లు వేగం పుంజుకున్నాయి. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం జులై 22 నాటికి 11.02 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండగా, జులై 29 నాటికి అది 20.46 లక్షల ఎకరాలకు చేరింది. మెదక్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో 75 శాతానికి పైగా సాగు పూర్తయింది.
అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో సాగు విస్తీర్ణం ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదు. నల్లగొండ జిల్లాలో పరిస్థితి మరింత వెనుకబడి ఉంది. అక్కడ 5.41 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 80 వేల ఎకరాల్లో కూడా నాట్లు పూర్తికాలేదు.
