సేవా దృక్పథంతో పిల్లల మానసిక, శారీరక ఉన్నతికి కృషి చేయాలి

సేవా దృక్పథంతో పిల్లల మానసిక, శారీరక ఉన్నతికి కృషి చేయాలి

ప్రైవేట్ విద్యాసంస్థలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచన

వికారాబాద్, జూన్ 17 (ఆంధ్రప్రభ): ప్రైవేట్ పాఠశాలలు కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో విద్యార్థుల మానసిక, శారీరక, సాంకేతిక అభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు.

బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్‌ను పరిగి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 26 లక్షల మంది, ప్రైవేట్ పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభించారని, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇటువంటి పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలను అందించేలా విద్యాసంస్థలు పనిచేయాలని సూచించారు.

వికారాబాద్‌లో శ్లోక విద్యాసంస్థ నాలుగో బ్రాంచ్‌ను ప్రారంభించడం అభినందనీయమని పేర్కొంటూ యాజమాన్యాన్ని అభినందించారు. పరిగి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మంచి లక్ష్యాలు, నాణ్యమైన విద్యా విధానంతో విద్యాసంస్థలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో శ్లోక విద్యాసంస్థల చైర్మన్ బిట్ల శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, చింతల సంగమేశ్వర్ గుప్తా, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.