“స్నేహం చారిటీస్” సేవలు అభినందనీయం.

  • పేద విద్యార్థులకు స్నేహం చారిటీస్ చేయూత..
  • ఏడో విడత ఉపకార వేతనాల పంపిణీ..
  • సేవలను కొనియాడిన ప్రముఖులు..

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న స్నేహం చారిటీస్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ వి. నారాయణరావు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు.

హనుమాన్‌పేటలోని ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన స్నేహం చారిటీస్ ఏడో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు నోట్‌బుక్స్ అందజేశారు.

ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు. దాతల సహకారంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలుస్తున్న స్నేహం చారిటీస్ సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు.

డాక్టర్ వి. నారాయణరావు మాట్లాడుతూ, ఉపకార వేతనం పొందిన విద్యార్థులు దానిని గౌరవంగా భావించి మరింత కష్టపడి చదవాలని సూచించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆత్మన్యూనత భావాన్ని దూరం చేసుకుని విద్యలో రాణించాలని పిలుపునిచ్చారు. మానవసేవే మాధవసేవ అనే భావనతో సేవలందిస్తున్న స్నేహం చారిటీస్‌ను అభినందించారు.

టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకున్న విద్యార్థులు తమలాంటి పేద విద్యార్థులకు చేయూత అందించాలని సూచించారు.

స్నేహం చారిటీస్ వ్యవస్థాపకుడు కె. రవీంద్ర మాట్లాడుతూ, గత 540 వారాలుగా నిరంతరాయంగా పేద విద్యార్థులకు సేవలందిస్తున్నామని తెలిపారు. తమ సేవా కార్యక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ మహానగర విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి పొట్టి శ్రీహరి, దేసు శ్రీనివాసరావు, కొప్పరావు రవి, స్నేహం చారిటీస్ సభ్యులు, దాతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.