గోవ‌ధ నిషేధ చ‌ట్టాల ప‌టిష్ట అమ‌లు

గోవ‌ధ నిషేధ చ‌ట్టాల ప‌టిష్ట అమ‌లు

  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ

జిల్లాలో గోవధ నిషేధం, జంతు సంక్షేమ చ‌ట్టాలను ప‌టిష్టంగా అమ‌లుచేసేందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు స‌మ‌ష్టిగా కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శుక్ర‌వారం రెడ్డిగూడెంలో జ‌రిగిన ప్ర‌త్యేక గ్రీవెన్స్‌, ఒక నెల‌-ఒక గ్రామం-నాలుగు సంద‌ర్శ‌న‌లు కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌శుసంవ‌ర్థ‌క శాఖ రూపొందించిన పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టాల అమలులో రెవెన్యూ, పోలీస్‌, పశుసంవర్ధక త‌దిత‌ర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ‌క్రీద్ సంద‌ర్భంగా జంతు వ‌ధ‌పై చ‌ట్ట‌ప‌రంగా చేయ‌ద‌గినవి, చేయ‌కూడ‌ని అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు.

ఆవులు, దూడ‌లు, ఒంటెల వ‌ధ నిషేధ‌మ‌ని, చ‌ట్ట‌రీత్యా నేర‌మ‌ని పేర్కొన్నారు. లైసెన్సు లేని వ‌ధ శాల‌లో లేదా అనుమ‌తి లేని ప్ర‌దేశాల్లో ప‌శువుల‌ను వ‌ధించ‌కూడ‌ద‌ని.. ప్రివెన్ష‌న్ ఆఫ్ క్రూయ‌ల్టీ టు యానిమ‌ల్స్ యాక్ట్‌-1960 లేదా సంబంధిత నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌కూడ‌ద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌శుసంవ‌ర్థ‌క శాఖ అధికారి డా. ఎం.హ‌నుమంత‌రావు, ఆర్‌డీవో ఎ.కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply