Pakistan Double Game | ఇరాన్ విమానాలకు పాక్ రహస్య ఆశ్రయం?

Pakistan Double Game | ఇరాన్ విమానాలకు పాక్ రహస్య ఆశ్రయం?

అంతర్జాతీయ దౌత్య చరిత్రలో పాకిస్తాన్ అంటే ఒక దేశం కాదు, అది ఒక వ్యవస్థీకృత నమ్మకద్రోహం. ఒక చేత్తో అమెరికా నుంచి బిలియన్ల కొద్దీ ‘వార్ ఆన్ టెర్రర్’ నిధులను నొక్కుతూనే, మరో చేత్తో అదే అగ్రరాజ్య శత్రువులకు ఎర్ర తివాచీలు పరచడం ఇస్లామాబాద్‌కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఇరాన్ సైనిక విమానాలకు రహస్యంగా తన గడ్డపై ఆశ్రయం కల్పించడం ద్వారా పాకిస్తాన్ మరోసారి తన రక్తం పంచుకున్న ద్వంద్వ నీతిని ప్రపంచం ముందు ఆవిష్కరించింది. ఇది కేవలం వ్యూహాత్మక తప్పిదం కాదు, అమెరికా ఆత్మగౌరవంపై పాకిస్తాన్ చేసిన సర్జికల్ స్ట్రైక్. నమ్మిన బంటు అని మురిసిపోతున్న పెంటగాన్ వర్గాలకు, ఇస్లామాబాద్ తనదైన శైలిలో ‘ఇరాన్ బాకు’తో సమాధానం చెప్పింది. ఈ దగాకోరు దౌత్యం వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలను తవ్వుకుంటూ పోతే, పాకిస్తాన్ ఆడుతున్న ‘డబుల్ గేమ్’ ఎంతటి రక్తపాతానికి దారితీస్తుందో అర్థమవుతుంది.

అమెరికా రక్షణ రంగాన్ని కుదిపేస్తున్న ‘సీబీఎస్ న్యూస్’ రహస్య నివేదిక కేవలం ఒక వార్తా కథనం కాదు, అది ఒక హెచ్చరిక. ఇరాన్‌పై అమెరికా తన సైనిక ఒత్తిడిని క్లైమాక్స్‌కు తీసుకెళ్తున్న తరుణంలో, ఇరాన్ తన అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలను రక్షించుకోవడానికి పాకిస్తాన్‌లోని ‘నూర్ ఖాన్’ ఎయిర్ బేస్‌ను వాడుకోవడం దేనికి సంకేతం? ప్రపంచం ముందు శాంతి దూతగా, అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు నటిస్తూనే, లోలోపల టెహ్రాన్‌కు ‘సేఫ్ హెవెన్‘ కల్పించడం పాకిస్తాన్ నైజం. పాక్ అధికారులు ఈ విషయాన్ని బుకాయిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ నిఘా వర్గాలు సేకరించిన శాటిలైట్ చిత్రాలు వారి ముఖంపై ఉమ్మేస్తున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న బేస్ నుంచి అంత పెద్ద విమానాల కదలికలను దాచలేమని వాదించే పాక్ మేధావులు, అదే ఇస్లామాబాద్ అబద్ధాల పునాదుల మీద నిర్మించబడిందన్న నిజాన్ని విస్మరిస్తున్నారు.

చరిత్ర పునరావృతం.. 1971 నాటి రుణ విముక్తి!

పాకిస్తాన్ చేస్తున్న ఈ దగా వెనుక ఐదు దశాబ్దాల క్రితం నాటి ఒక క్రూరమైన స్నేహం దాగి ఉంది. 1971లో భారత సైన్యం ధాటికి పాకిస్తాన్ విలవిలలాడుతున్నప్పుడు, తన విమానాలను, ఆయుధాలను కాపాడుకోవడానికి పాక్ ఇదే తరహాలో ఇరాన్ గడ్డను వాడుకుంది. నాటి షా పహ్లావీ ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇంధనాన్ని, మందుగుండు సామగ్రిని సరఫరా చేసి భారత్‌పై యుద్ధానికి పరోక్షంగా సహకరించింది. ఇప్పుడు ఐదు దశాబ్దాల తర్వాత, అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతున్న వేళ ఇరాన్‌కు తన భూభాగాన్ని ఆశ్రయంగా ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ ఆ రుణాన్ని తీర్చుకుంటోంది. అంటే, పాకిస్తాన్ దృష్టిలో మిత్రత్వం అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం కాదు, అంతర్జాతీయ నియమాలను ఎలా తుంగలో తొక్కి తమ ఉనికిని కాపాడుకోవాలనే కుతంత్రం మాత్రమే.

సివిల్ విమానాల ముసుగులో సైనిక మోసం

పాకిస్తాన్ ఈ ఆపరేషన్‌ను ఎంత పకడ్బందీగా నిర్వహించిందంటే, ‘మహాన్ ఎయిర్’ వంటి పౌర విమానయాన సంస్థల ముసుగులో ఇరాన్ తన సైనిక ఆస్తులను ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్‌కు తరలించింది. ఇది కేవలం గూఢచార వైఫల్యం కాదు, అమెరికా నిఘా నేత్రాలను కళ్లుగప్పి చేసిన ఒక పక్కా క్రిమినల్ ప్లాన్. ఒకవైపు అమెరికా రక్షణ నిధులను మేస్తూనే, మరోవైపు అదే అమెరికా శత్రువుకు దొడ్డిదారిలో రక్షణ కల్పించడం అనేది పాకిస్తాన్‌కు మాత్రమే సాధ్యమైన అరుదైన నైపుణ్యం. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం, పాకిస్తాన్ తన భూభాగాన్ని ఎంతటి వినాశకరమైన చర్యలకు వేదికగా మారుస్తోందో కళ్లకు కడుతోంది. అగ్రరాజ్యం తన శత్రువులను వేటాడుతుంటే, పాకిస్తాన్ ఆ శత్రువులకు పాలుపోసి పెంచుతోంది.

అబద్ధాల అబోటాబాద్.. ఒక శాశ్వత కళంకం

ప్రపంచం ఒసామా బిన్ లాడెన్ కోసం పాతాళం వరకు వెతుకుతుంటే, అతడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నివాసానికి కూతవేటు దూరంలో సంవత్సరాల తరబడి సుఖంగా ఉన్నాడంటే, ఆ దేశపు నిఘా వ్యవస్థ ఎంతటి మోసకారిదో అర్థమవుతుంది. 2018లో Donald Trump “పాకిస్తాన్ మనకు అబద్ధాలు చెప్పింది, మనల్ని మోసం చేసింది” అని ట్వీట్ చేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే, పాకిస్తాన్ తన మనుగడ కోసం అబద్ధాలనే ఆక్సిజన్‌గా వాడుకుంటుంది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ‘మాకు తెలియదు, మా గడ్డపై ఇరాన్ విమానాలు లేవు’ అని పాక్ బుకాయిస్తున్న తీరు, నాటి అబోటాబాద్ అబద్ధాలను గుర్తుకు తెస్తోంది.

డ్రాగన్ నీడలో బ్లాక్మెయిల్ రాజకీయం!

ప్రస్తుతం పాకిస్తాన్ రక్షణ రంగంలో చైనా వాటా 80 శాతానికి చేరుకుంది. అంటే, పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా మిత్రదేశం కాదు, చైనా చెప్పుచేతల్లోని ‘కాలనీ‘గా మారిపోయింది. ఒకవైపు చైనా ప్రాపకం కోసం పాకులాడుతూ, మరోవైపు అమెరికాను న్యూక్లియర్ భయంతో బ్లాక్మెయిల్ చేయడం పాక్ అసలు ఎత్తుగడ. “మాకు సాయం చేయకపోతే మా అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తాయి” అని బెదిరించడం ద్వారా అమెరికా నుంచి నిధులు గుంజడం ఇస్లామాబాద్ క్రమం తప్పకుండా చేసే పని. ఈ క్రమంలోనే అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం పేరుతో ఒక కొత్త నాటకానికి తెరలేపి, ఆ ముసుగులో ఇరాన్‌కు సైనిక వెసులుబాటు కల్పించింది. ఇది దౌత్యం కాదు, ఒక నీచమైన బేరసారాల రాజకీయం.

ట్రంప్ మౌనం: వ్యూహాత్మక తప్పిదమా? వ్యక్తిగత ప్రయోజనమా?

ఇంత జరుగుతున్నా అమెరికా అధ్యక్షుడు Donald Trump మాత్రం పాకిస్తాన్‌ను వెనకేసుకురావడం రక్షణ నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ‘ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్’ అని పొగడటం వెనుక ట్రంప్ కుటుంబ వ్యాపారాల ప్రయోజనాలు ఉన్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అమెరికా గూఢచార సంస్థలు గగ్గోలు పెడుతున్నా, శాటిలైట్ చిత్రాలు సాక్ష్యం చెప్తున్నా, ట్రంప్ తన మొండి వైఖరితో పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం అంటే అది అమెరికా సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టడమే. శత్రువుకు ఆశ్రయం ఇచ్చిన దేశాన్ని ‘మిత్రుడు’ అని సంబోధించడం వల్ల అమెరికా అంతర్జాతీయ పరపతి గంగలో కలుస్తోంది.

సి.ఎల్.ఎన్. రాజు
9052116353

Leave a Reply