గ్రానైట్ క్వారీలో విషాదం..

గ్రానైట్ క్వారీలో విషాదం..
- డైమండ్ వైర్ తెగి కార్మికుడు మృతి
మెలియాపుట్టి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని పట్టుపురం సమీపంలో ఉన్న రాజయోగ్ గ్రానైట్ క్వారీలో జరిగిన దుర్ఘటనలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. నాగ్‌పూర్ జిల్లాకు చెందిన ధర్మారామ్ జాట్ (34) అనే యువకుడు అక్కడ స్టోన్ కట్టర్‌గా పనిచేస్తూ గురువారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ధర్మారామ్ స్టోన్ కటింగ్ పనులు నిర్వహిస్తుండగా, యంత్రంలో ఉన్న డైమండ్ వైర్ అకస్మాత్తుగా తెగిపోయి అతని మెడకు గుచ్చుకుంది.
దీంతో తీవ్ర రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో క్వారీలో ఒక్కసారిగా కలకలం రేగింది. సహచర కార్మికులు వెంటనే స్పందించినప్పటికీ, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న మెలియాపుట్టి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, యంత్రాల భద్రతా ప్రమాణాలపై కూడా విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కార్మికుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
