యువకుడిని కాపాడిన పోలీసులు

బాసర, ఆంధ్రప్రభ: గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని బాసర పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ధర్మాబాద్ రామ్‌నగర్‌కు చెందిన గజానన్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో మద్యానికి బానిసై తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు.

అదే సమయంలో విధుల్లో ఉన్న బాసర పోలీస్ సిబ్బంది గమనించి వెంటనే నదిలోకి వెళ్లి గజానన్‌ను రక్షించారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం అతడి అన్న సాయినాథ్‌కు అప్పగించారు. యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.