యువకుడిపై దాడి.. చంపేస్తామని బెదిరింపు..
గుంటూరు వెస్ట్ క్రైమ్, జులై 31(ఆంధ్ర ప్రభ): గుంటూరులో ఓ ఫార్మసీ విద్యార్థిపై దాడి చేసి, బయట కనిపిస్తే చంపేస్తామని బెదిరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు అమరావతి రోడ్డులోని భారతిపేటకు చెందిన కొల్లూరు మధు కమల్ (21) చేబ్రోలు హనుమయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చదువుతున్నాడు. ఈనెల 29న మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, తమ ఇంటి పక్కనే నివసించే బలుసుపాటి సుబ్బారావు ఇంటికి వచ్చి తలుపు తట్టారని తెలిపారు.
తలుపు తీసి లోపలికి ఆహ్వానించిన వెంటనే సుబ్బారావు అసభ్య పదజాలంతో దూషిస్తూ బయటకు లాగాడని, ఆ సమయంలో అక్కడ ఉన్న బలుసుపాటి సుజాత లక్ష్మి, బలుసుపాటి సాయి తదితరులు కలిసి తనపై దాడి చేశారని ఆరోపించారు.
అడ్డుకునేందుకు వచ్చిన తన అన్న కొల్లూరు వెంకట సాయిపై కూడా దాడి చేసి, ఇద్దరినీ తీవ్రంగా కొట్టి, రోడ్డుపై కనిపిస్తే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి అనంతరం కుటుంబ సభ్యులు ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనకు గల కారణం తనకు తెలియదని బాధితుడు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
