ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు..

ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు..

  • తహసీల్దార్ వెంకటేశ్వర్లు హెచ్చరిక
  • ఫెర్రీలో ఇసుక రీచ్ పై దాడులు
  • ఐదు ట్రాక్టర్లు స్వాధీనం.. ఒక్కో ట్రాక్టర్ కు రూ.10 వేలు జరిమానా
  • ఆంధ్రప్రభ ఎఫెక్ట్

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ‘కృష్ణమ్మకు తూట్లు’, ‘ఇదే నా పంథా.. ఆపను దందా’ శీర్షికలతో ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనాలకు రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించారు. ఫెర్రీలోని ఇసుక రీచ్ పై బుధవారం దాడులు చేశారు. ఇసుక లోడింగ్ కోసం వచ్చిన ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని వాల్టా యాక్ట్ ప్రకారం ఒక్కొక్క ట్రాక్టర్ కు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారు. ట్రాక్టర్లను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఇసుక లోడింగ్ చేస్తున్న వారిని హెచ్చరించారు.

రీచ్ లో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. కాగా అధికారుల రాకను గమనించిన వసూళ్లకు పాల్పడే తెలుగు తమ్ముడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడుల్లో ఇబ్రహీంపట్నం సీఐ ఎ.సుబ్రహ్మణ్యం, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.