మూడుచింతలపల్లిలో జంతర్ మంతర్…

మూడుచింతలపల్లిలో జంతర్ మంతర్…
- ఆస్తి పన్నుల లెక్కల్లో అవకతవకలు…
- ఆన్లైన్ లో ఒకలా… ఉన్నది మరోలా…
- సుమారు 40 లక్షల ఆస్తి పన్ను తేడా…?
- కట్టిన రశీదు ఉన్నా… ఆన్లైన్ లో బకాయి…
- ఇష్టారాజ్యంగా అధికారుల తీరు..
మూడు చింతలపల్లి, ఆంధ్రప్రభ : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లో ఆస్తి పన్ను లెక్కల విషయంలో గందరగోళం పరిస్థితి నెలకొంది. ఆస్థి పన్ను లెక్కల విషయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మూడు చింతలపల్లి మండలంగా ఉన్నప్పటి ఆస్తి పన్ను లెక్కలు ప్రస్తుత మూడు చింతలపల్లి మున్సిపల్ ఆస్తి పన్ను లెక్కల్లో భారీగా తేడా కనిపిస్తోంది. ఈ తేడా ను ఎలా సవరించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఇంత వ్యత్యాసం రావడానికి గలా కారణాలు ఏమై ఉంటాయో అని అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. గతంలో మూడు చింతలపల్లి లో డిమాండ్ రూ.3 కోట్ల 30 లక్షలు ఉన్నట్లు అధికారులు చెబుతుండగా ప్రస్తుతం ఆన్లైన్ లో మాత్రం రూ. 2 కోట్ల 81 లక్షలు ఉండడం ఎలా అని ఆశ్చర్యపోతున్నారు. గ్రామ పంచాయితీలుగా ఉన్నప్పుడు ప్రజల వద్ద వసూలు చేసిన ఆస్తి పన్నులు ఆన్ లైన్ లో నమోదు చెయ్యలేదా చేస్తే ఏమైనట్లు, చెయ్యకపోతే ఏమైనట్లు అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆన్లైన్ లో ఒకలా… ఉన్నది మరోలా…

ప్రజలు ఆస్తి పన్నుల లెక్కల విషయంలో గ్రామ పంచాయితీలుగా ఉన్నప్పుడు ఆన్ లైన్ లో అప్లోడ్ చెయ్యకుండా వసూలు చేసిన డబ్బులు క్యాష్ ఇన్ హాండ్ గా పెట్టుకోవడం ద్వారా ఆన్ లైన్ లో బకాయిలుగా చూపిస్తోందని అధికారులు చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే వసూలు చేసిన ఆస్తి పన్ను డబ్బులను ఆన్ లైన్ లో నమోదు చేసి ఎస్ టీ వో లో జమ చేయాల్సి ఉంటుంది తద్వారా చెక్కుల రూపంలో డబ్బులు డ్రా చేసి వినియోగించాలి.
కానీ.. అధికారులు మాత్రం చాలా మట్టుకు డబ్బులు జమ చెయ్యకుండా క్యాష్ ఇన్ హాండ్ గా పెట్టుకొని అభివృద్ధి పేరిట ఖర్చు చేశామని చెప్పడం బిల్స్ జత పరచడం వంటివి చేసేవారని పలువురు అంటున్నారు. అయితే ఆడిట్ చెయ్యడానికి వచ్చిన అధికారులు ఈ కుంటి సాకులను పట్టించుకోకుండా రీ మర్క్స్ రాసే వారని కొందరు అంటున్నారు. దీంతోనే ప్రస్తుతం ఆన్ లైన్ లో ఒక లా మాన్యువల్ గా మరోలా ఉంటోందని చెబుతున్నారు. ఆస్తి పన్ను లెక్కల విషయంలో మున్సిపల్ కమీషనర్ కింది స్థాయి అధికారుల పై గరంగరంగా ఉన్నట్లు స్పష్టతత తెలియజేయాలని కోరినట్లు సమాచారం.
సుమారు 40 లక్షల ఆస్తి పన్ను తేడా…?
గతంలో ఆస్తి పన్ను డిమాండ్ రూ. 3 కోట్ల 30 లక్షలు ఉండేదని 100 శాతం పన్నులువసూలు చేశామని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఏర్పడ్డాక రూ. 2 కోట్ల 81 లక్షలు ఉందని అందులో రూ. 1 కోటి 72 లక్షలు వసూలు చేశామని 69 శాతం పూర్తయిందని మున్సిపల్ అధికారులు అంటున్నారు. మరి రూ. 3 కోట్ల ముప్పై లక్షలకు రూ. 2 కోట్ల 81 లక్షలకు మధ్య ఉన్న సుమారు రూ.40 లక్షలు ఎటు పోయాయి.
అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేక చేతి వాటామ అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మున్సిపల్ అధికారుల తీరు భిన్నంగా ఉంది. మున్సిపల్ ప్రకారం వసూలు చేస్తాం డబ్బులు జమ చేస్తాం గత పన్నుకు సంబంధించి తమ శాఖకు అవసరం లేదని చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆస్తి పన్ను ప్రభుత్వానికి చెల్లించేది కాదా అభివృద్ధి కి ఉపయోగించేది కాదా మరి ఎలా పట్టిపట్టనట్టు వ్యవహరిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోతే పోయేది ప్రజల డబ్బే కదా మాకేంటని అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయితీలుగా ఉన్నప్పట్టి ఆస్తి పన్నుల లెక్కల ఆధారంగానే మున్సిపల్ లో వసూలు చేస్తున్నామని కొత్తగా టాక్స్ అసిస్టెంట్ చేయలేదని ఒక్కసారి లేదు లేదు మాకు సంబంధం లేదని మరొక్కసారి అధికారులు చెప్పడం వింతగా ఉందని పలువురు అంటున్నారు.
అయోమయంలో ప్రజలు…
ప్రజలు ఆస్తి పన్ను చెల్లించామని రాశీదులు కూడా ఉన్నాయని మళ్ళీ బకాయిలు గా ఉన్నాయని పన్ను చెల్లించాలని అధికారులు అంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. సంవత్సరానికి రెండు సార్లు ఆస్తి పన్ను కట్టాల్సి ఉంటుందని తెలుసు కానీ ఆస్తి పన్ను కట్టినా రాశీదులు ఉన్న మళ్లీ కట్టాల అని మూడు చింతలపల్లి మున్సిపల్ వ్యాప్తంగా కోడై కూస్తోంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే లెక్కల్లో ఇంత తేడా ఉండగా 100 శాతం ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నామని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్తుండడం. జిల్లా కలెక్టర్ స్పందించి ఆస్తి పన్ను లెక్కల పై విచారణ జరిపి లెక్కల్లో వ్యతిహాసం చూపించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారుల వివరణ కోరగా…
త్వరలోనే లెక్కలన్ని తెలుస్తాం…
ఈర్షద్, ఆర్ఐ మూడుచింతలపల్లి

ఆన్ లైన్ లో ఉన్న ఆధారంగానే ఆస్తి పన్ను వసూలు చేస్తున్నాం. ఆర్ధిక సంవత్సరం ముగిశాక అన్ని లెక్కలు తేల్చి నివేదిక తయారుచేస్తాం. రాశీదులు ఉండి ఆన్ లైన్ లో పేరు ఉంటే ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పని లేదు.
ఆన్ లైన్ లో బకాయిగా ఉంటే చెల్లించాల్సిందే…
పవన్ కుమార్, ఎంసీపల్లి మున్సిపల్ కమీషనర్

ప్రజలు ఆస్తి పన్ను కట్టిన రాశీదులు ఉన్నా ఆన్ లైన్ లో బకాయిలుగా చూపిస్తే పన్ను చెల్లించాల్సిందే. ఏవైనా అభ్యంతరాలు ఉంటే వసూలు చేసిన వారిని సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలి. గతంతో మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదు. రాశీదులు ఉండి ఆన్ లైన్ లో లేకపోతే రాశీదులు ఆధారంగా అధికారుల పై చర్యలు తీసుకుంటాం..
